కలం, ఖమ్మం బ్యూరో : దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతా రామచంద్ర స్వామి వారికి భక్తులు కానుకల వర్షం కురిపించారు. గత 68 రోజులుగా ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కించారు. ఈ లెక్కింపు ద్వారా స్వామివారికి రికార్డు స్థాయిలో రూ. 2,43,64,452 (రెండు కోట్ల నలభై మూడు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు) నగదు ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు అధికారికంగా వెల్లడించారు. గత ఏప్రిల్ 15వ తేదీన చివరిసారిగా హుండీ లెక్కింపు జరగగా, మళ్లీ ఇన్నాళ్లకు అధికారులు ఈ ప్రక్రియను చేపట్టారు. వేసవి సెలవులు, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దేశ విదేశాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు తమ మొక్కుబడులను హుండీ ద్వారా చెల్లించుకున్నారు.
నగదు రూపంలోనే కాకుండా స్వామివారిపై ఉన్న భక్తి ప్రపత్తులతో భక్తులు సమర్పించిన బంగారు, వెండి కానుకలు కూడా హుండీలో పెద్ద సంఖ్యలోనే దర్శనమిచ్చాయి. ఇందులో 51 గ్రాముల బంగారం, ఒక కేజీ వెండి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ ఈఓ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో, సిబ్బంది, భక్తుల భాగస్వామ్యంతో ఈ లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశారు.

