కలం, కరీంనగర్ బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు పంచుతారా లేక సీపీఐ (Karimnagar CPI) ఆధ్వర్యంలో ఆక్రమించుకోమంటారా? తక్షణమే తెలపాలని రేవంత్ సర్కార్‌కు సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సూటి ప్రశ్న వేశారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని సోమవారం కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగిందని పార్టీ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరీంనగర్ నగరంలో ఎంతో మంది నిరుపేదలు ఇండ్లు లేక అద్దె ఇండ్లల్లో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ కూలీ పనులు చేసుకొని, చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పారు. చాలీచాలని ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటూ ఇంటి అద్దె కట్టలేక ఆర్థికంగా ఏమీ లేని కుటుంబాలు కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
పదేళ్లయినా ఇళ్లు కేటాయించరా?
గత ప్రభుత్వ హాయంలో దాదాపు 600 ఇండ్లను చింతకుంట ప్రాంతంలో నిర్మాణం చేసి ఉన్నాయని, నిర్మించి దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ వాటిని అర్హులైన వారికి కేటాయించకపోవడం వల్ల అవి నిరుపయోగంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు వాటిని పంపిణీ చేయలేదని, తక్షణమే ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేస్తుందా? లేక సీపీఐ ఆధ్వర్యంలో పేదలచే ఆ డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆక్రమించమంటారా? దీనిని ప్రభుత్వం తేల్చాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి. ఓ) షర్మిలకు సీపీఐ నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరుకోలు సదానందం, దుడ్డేల సమ్మయ్య, సీపీఐ శాఖ కార్యదర్శులు గామినేని సత్యం, చెంచల మురళి, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, బాకం ఆంజనేయులు, భారతి, కాల్వ శ్రీనివాస్, తంగెళ్ళ సదయ్య, కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, మమత, స్వాతి, భూక్యా ముని, స్రవంతి, గుర్రం సదానందం, బరిగెల విజయ్ తదితరులు పాల్గొన్నారు.

