కలం, మహబూబ్ నగర్ బ్యూరో: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ప్రక్రియ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమం నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ (Wanaparthy Collector) ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి హాల్లో SIR ప్రక్రియ పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలందరూ SIRలో భాగస్వాములై తమ ఓటును జాబితాలో నమోదు చేసుకునే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
అందులో భాగంగానే మంగళవారం ఉదయం 6 గంటలకు ‘2కే రన్’ నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 25 నుండి జూలై 31 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు కార్యక్రమం చేపడతారని అన్నారు. అక్టోబర్ 1వ తేదీ 2026 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకునే యువత సైతం ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇవే విషయాలను జిల్లాలోని ఓటర్లందరికీ అర్థమయ్యే విధంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని సూచించారు.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుండి వయా కొత్త బస్టాండ్ మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు 2కే రన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీకి ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

