కలం, వెబ్డెస్క్: నేటి ఆధునిక జీవనశైలి మన అలవాట్లను పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు క్రమశిక్షణతో కూడిన దినచర్య ఉండేది, కానీ నేడు సాంకేతికత, బిజీ లైఫ్ వల్ల పెద్దలతో పాటు పిల్లల ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. గంటల తరబడి ఫోన్లు చూడటం, లేట్ నైట్ నిద్రపోవడం, జంక్ ఫుడ్ ఇలాంటి అలవాట్లు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. అయితే పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేందుకు (Memory Improvement Tips) తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పడు తెలుసుకుందాం. నిపుణుల ప్రకారం..
1. సరైన నిద్ర
ముఖ్యంగా పిల్లల మెదడు చురుకుగా పనిచేయాలంటే చక్కని నిద్ర చాలా అవసరం. అందుకే పిల్లలు ప్రతిరోజూ కనీసం 8 నుంచి 9 గంటలు ప్రశాంతంగా నిద్రపోయేలా చూసుకోవాలి.
2. పోషకాహారాన్ని ఇవ్వడం
పిల్లలకు ఇచ్చే ఆహారంలో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. రోజూ పాలు, పండ్లు, బాదం పప్పులను ఆహారంలో చేరిస్తే పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగడంతో పాటు రోజంతా యాక్టివ్ గా ఉంటారు.
3. క్రమం తప్పకుండా చదివించడం
మెదడు ఒక కండరం లాంటిది. దానికి ఎంత వ్యాయామం ఇస్తే అంత పదునుగా మారుతుంది. అందుకే ప్రతిరోజూ స్కూల్ నుంచి రాగానే చదవడం వల్ల మెదడులోని కణాలు చురుగ్గా మారి, కొత్త కనెక్షన్లను ఏర్పరుచుకుంటాయి. దీనివల్ల పిల్లల ఆలోచనా శక్తి, గ్రహణ శక్తి పెరుగుతాయట. స్కూల్లో విన్న పాఠాన్ని అదే రోజు సాయంత్రం ఇంట్లో మళ్ళీ చదవడం వల్ల, ఆ సమాచారం తాత్కాలిక జ్ఞాపకశక్తి నుండి శాశ్వత జ్ఞాపకశక్తికి మారుతుంది. దీనివల్ల పరీక్షల సమయంలో ప్రత్యేకంగా బట్టీ పట్టాల్సిన అవసరం ఉండదు.
4. రాతతోనే జ్ఞాపకశక్తి
చదవడం ఒక ఎత్తయితే, దానిని సొంత మాటల్లో చిన్న పాయింట్ల రూపంలో నోట్స్ రాసుకోవడం అనేది పిల్లల జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే ఒక గొప్ప శాస్త్రీయ పద్ధతి. అందుకే చదివిన అంశాలను క్లుప్తంగా చిన్న పాయింట్ల మాదిరి రాయడాన్ని పిల్లలకు నేర్పించాలి.
5. పది నిమిషాల విరామం
కొంతమంది తల్లిదండ్రులు గంటలతరబడి పిల్లలను చదివిస్తూనే ఉంటారు. ఇలా చేయడం వలన పిల్లలు అలసిపోతారు. అప్పుడు ఏకాగ్రత తగ్గుతుంది. దీనివల్ల చదివిన అంశాలు గుర్తుండకపోవచ్చు. కాబట్టి కనీసం గంటకోసారి పది నిమిషాల విరామాన్ని తీసుకోవడం పిల్లలకు అలవాటు చేయాలని చెబుతున్నారు నిపుణులు.
6. గేమ్స్ ఆడించడం
సెలవు రోజుల్లో పిల్లలకు ఫోన్లు ఇచ్చి కూర్చోబెట్టకుండా పిల్లలతో కలిసి పజిల్స్ పూరించడం, చదరంగం లేదా మెమరీ గేమ్స్ ఆడడం లాంటివి చేస్తుండాలి. ఇటువంటి ఆటల వల్ల పిల్లల్లో ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యం పెరుగుతాయి. అంతే కాకుండా వేగంగా స్పందించడం, ప్రతి అంశాన్ని వివరంగా గుర్తుపెట్టుకోవడం వంటివి పిల్లలకు అలవాటవుతాయి.
7. పడుకునే ముందు కథలు చెప్పడం
సాధారణంగా పిల్లలు రాత్రి పడుకునే ముందు మెదడు చాలా ప్రశాంతంగా ఉంటుందట. అందుకే ఆ సమయంలో చిన్నచిన్న కథలు చెప్పడం వలన పిల్లలు వాటిని ఆసక్తిగా వింటారు. వారు మన మాటలను బట్టి తమ మనస్సులో ఒక కొత్త లోకాన్ని, పాత్రలను (రాకుమారుడు, అడవి, జంతువులు) ఊహించుకుంటారు. ఇది వారి ఊహాశక్తిని, సృజనాత్మకతను అద్భుతంగా పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు.
ఈ జాగ్రత్తలు పాటించడం వలన పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచవచ్చని చెబుతున్నారు నిపుణులు.

