Mobile Popup Ad
Mobile Popup Ad

జీ రామ్‌‌ జీపై తెలంగాణ స‌ర్కార్‌ లీగల్ పోరు!

కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌‌ జీ చట్టం (VBG RAM G Act) అమలుతో గ్రామీణ ఉపాధి పథకం, రాష్ట్రాల ఆర్థిక హక్కులు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం ప్రభావాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ సహా ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కూలీల జీవనోపాధి, స్థానిక సంస్థలపై చట్టం ప్రభావం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కొత్త చట్టంలో ప్రతిపాదించిన 60 రోజుల ఉపాధి విరామ నిబంధన గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయడం సాధ్యం కాదని సబ్ కమిటీ అభిప్రాయపడింది. దీని వల్ల ఉపాధి అవకాశాలు తగ్గడమే కాకుండా కూలీ రేట్లపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల జీవన భద్రతకు ఇది ముప్పుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

రాష్ట్రాలపై 40% ఆర్థిక భారం

– జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని సబ్ కమిటీ తప్పుబట్టింది. రాష్ట్రాలపై 40% నిధుల భారాన్ని మోపడం సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నది.
– రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సముచితం కాదని అభిప్రాయపడింది.
– రాజ్యాంగంలోని ఆర్టికల్ 258(3) ప్రకారం కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగిస్తే వాటికి సంబంధించిన వ్యయాన్ని కూడా భరించాల్సి ఉంటుందని గుర్తుచేసింది.
– తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతీ రూపాయికి తిరిగి కేవలం 40 పైసలే వస్తున్న పరిస్థితిలో మరో 40% ఆర్థిక భారం రాష్ట్రంపై మోపడం ఆమోదయోగ్యం కాదని మంత్రులు స్పష్టం చేశారు. కొత్త చట్టాన్ని న్యాయపరంగా, రాజ్యాంగపరంగా సవాల్ చేసే అవకాశాలపై సమావేశంలో చర్చించారు.
– ఈ అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు సేకరించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాలని సబ్ కమిటీ నిర్ణయించింది. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని కూడా పరిశీలించనున్నట్లు తెలిపింది.

2–3 రోజుల్లో తదుపరి కార్యాచరణ

ఈ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాలు విడివిడిగా కాకుండా ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరిపి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. కర్నాటక, కేరళ, జార్ఖండ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలతో చర్చలు జరపాలని భావిస్తోంది. గ్రామీణ సంక్షేమం, ఉపాధి భద్రత, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ ప్రధాన లక్ష్యాలుగా సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సబ్ కమిటీ వెల్లడించింది. మరో రెండు మూడు రోజుల్లో మళ్లీ సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>