కలం, వెబ్ డెస్క్ : ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో (FIH Pro League) భారత పురుషుల హాకీ జట్టు మరోసారి తన పోరాట పటిమను చాటింది. నెదర్లాండ్స్‌పై 3-2 తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. హాకీ క్లబ్ రోటర్‌డామ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య నెదర్లాండ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. వేగవంతమైన పాసింగ్‌తో భారత డిఫెన్స్‌పై ఒత్తిడి తీసుకొచ్చినా, భారత రక్షణ విభాగం క్రమంగా పుంజుకుని ప్రత్యర్థి దాడులను సమర్థంగా అడ్డుకుంది. దీంతో తొలి క్వార్టర్ గోల్ లేకుండానే ముగిసింది.
రెండో క్వార్టర్‌లో భారత్ తన ఆటతీరును మెరుగుపరుచుకుంది. 18వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జుగ్‌రాజ్ సింగ్ గోల్‌గా మలిచి భారత్‌కు ఆధిక్యం అందించాడు. అయితే వెంటనే నెదర్లాండ్స్ సమాధానం ఇచ్చింది. 19వ నిమిషంలో పెపిజిన్ వాన్ డర్ హైడెన్ పెనాల్టీ కార్నర్ ద్వారా స్కోరు సమం చేశాడు. తరువాత మ్యాచ్ మరింత హోరాహోరీగా మారింది. 27వ నిమిషంలో జర్మన్‌ప్రీత్ సింగ్ ఇచ్చిన అద్భుత పాస్‌ను అభిషేక్ గోల్‌గా మలిచి భారత్‌ను మరోసారి ముందంజలో నిలిపాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో నెదర్లాండ్స్ సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా, భారత డిఫెన్స్ గట్టిగా నిలిచింది. ముఖ్యంగా అమిత్ రోహిదాస్ నేతృత్వంలోని రక్షణ విభాగం ప్రత్యర్థి దాడులను సమర్థంగా అడ్డుకుంది.
మ్యాచ్ చివరి క్వార్టర్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. 56వ నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్ సమన్వయంతో భారత్‌కు మరో అవకాశం లభించగా, ఆ తరువాత వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను రాజిందర్ సింగ్ గోల్‌గా మలిచి స్కోరును 3-1కు చేర్చాడు.చివరి నిమిషాలలో నెదర్లాండ్స్ మరో గోల్ సాధించి స్కోరును 3-2కు తగ్గించినా, భారత్ తన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌ను విజయంతో ముగించింది. ఈ విజయంతో భారత్ రోటర్‌డామ్ దశలో కీలక ఫలితాన్ని సాధించగా, తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ సింగ్ మిడ్‌ఫీల్డ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

