Mobile Popup Ad
Mobile Popup Ad

టెస్టుల్లోకి రీ ఎంట్రీపై కోహ్లీ క్లారిటీ.. ఏమన్నాడంటే?

కలం, స్పోర్ట్స్: భారత క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న టెస్టు క్రికెట్ పునరాగమనంపై విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి స్పష్టత ఇచ్చాడు. తాను టెస్టు క్రికెట్‌కు తిరిగి వచ్చే ఆలోచనలో లేనని ఆయన వెల్లడించాడు. ఢిల్లీలో తన బ్రాండ్ వన్8 కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీతో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆయన టెస్టు కెరీర్‌లో చేసిన 9,230 పరుగులకు గుర్తుగా రూ.9,230 ధరతో ఎరుపు రంగు షూను విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత సరదాగా, మరికొన్ని పరుగులు చేయడానికి టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తే షూ ధర కూడా పెరుగుతుందని వ్యాఖ్యానించాడు.

దానికి స్పందించిన కోహ్లీ, టెస్టు క్రికెట్‌తో తన ప్రయాణం పూర్తైందని, ఇక తిరిగి వచ్చే అవకాశం లేదని సరదాగా చెప్పాడు. దీంతో టెస్టు పునరాగమనంపై వస్తున్న ఊహాగానాలకు ఆయన ముగింపు పలికినట్టైంది. కోహ్లీ 2025 మేలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 10 వేల పరుగుల మైలురాయికి 800 పరుగుల లోపే దూరంలో ఉన్నప్పటికీ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతకుముందు 2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా వీడ్కోలు చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డే క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. 2027 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో భారత బ్యాటర్లలో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన జాబితాలో ఆయన నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆయన ఖాతాలో 9,230 పరుగులు, 30 సెంచరీలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు కోహ్లీ (Virat Kohli) భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2026 ముగింపు సమయంలో హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన ఆయన, అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే ఆ సిరీస్‌లో భారత్ 3-0తో విజయం సాధించింది. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ, కోహ్లీ తుది జట్టులో ఆడటం ఫిట్‌నెస్ అనుమతిపై ఆధారపడి ఉంటుంది. జూలై 14న ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. టెస్టు క్రికెట్‌కు తిరిగి వచ్చే అవకాశం లేదని కోహ్లీ స్పష్టం చేయగా, ఇప్పుడు అభిమానుల దృష్టి ఆయన వన్డే కెరీర్‌పైనే నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>