కలం, వెబ్ డెస్క్: తెలుగువారు చాలామంది ఇష్టంగా తినే చింతచిగురు (Tamarind Leaves) ధర ప్రస్తుతం సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో విరివిగా లభించే చింతచిగురులో అనేక పోషక విలువలు, ఔషధ గుణాలుంటాయి. అందుకే ఈ సీజన్‌లో చింతచిగురు పప్పు, చింతచిగురు మటన్ లొట్టలేసుకుంటూ తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా చింత చెట్లకు కొత్త చిగురు రాక మార్కెట్‌లో దొరకడం లేదు.
పోషకాల గని అయిన చింతచిగురుకు (Tamarind Leaves) మార్కెట్లో డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. తెలంగాణలోని జగిత్యాల పరిసర ప్రాంతాల్లో కిలో చింతచిగురు ధర ఏకంగా రూ.1000 పలుకుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్, మటన్ ధరలను మించి చింతచిగురు రేటు పెరగడంతో షాక్ అవుతున్నారు. కూరగాయల మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు అంత ధర పెట్టి కొనలేక వెనుదిరుగుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసితే తప్ప ఈ ధరలు అదుపులోకి వచ్చేలా లేవని వ్యాపారులు చెబుతున్నారు.

