Mobile Popup Ad
Mobile Popup Ad

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీటి సంక్షోభం.. సాగు, త్రాగునీటికి దిక్కేది?

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాల జాడ లేకపోవడం, ఎండల తీవ్రతకు నీటి ఆవిరి పెరిగిపోతుండటంతో జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సాగుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఈ పాటికే నాట్లు వేయాల్సిన రైతులు.. వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకూ పడిపోతున్న నీటిమట్టాలతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఈసారి సాగునీటికి, తాగునీటికి సైతం తీవ్ర ఇక్కట్లు తప్పేలా లేవు.

పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి జలాశయాలు..

ఉమ్మడి జిల్లా వ్యవసాయానికి జీవనాడులైన గోదావరి, మానేరు నదులు ఈ వేసవిలో పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. వీటిపై ఆధారపడిన ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు రోజురోజుకూ దిగజారుతుండటం అటు రైతులను, ఇటు వ్యవసాయ అధికారులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఎండల తీవ్రతకు జలాశయాల్లో నీటి ఆవిరి కూడా వేగంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే తీవ్ర నిరాశే ఎదురవుతోంది. మిడ్ మానేరు డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 27.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 7.4 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 20.17 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను.. ఇప్పుడు కేవలం 7.8 టీఎంసీల నీరే ఉంది. ఎగువ మానేరు: పూర్తిస్థాయి నీటిమట్టం 1 టీఎంసీ కాగా, ప్రస్తుతం 19 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. దిగువ మానేరు డ్యామ్ (LMD) 24 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 6 టీఎంసీలు మాత్రమే రికార్డయ్యింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

వరి పంటకు ఎక్కువ నీరు అవసరమవుతుండటంతో దానికి బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి లేదా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. వర్షాలు పడేవరకు నీటిని చాలా అచితూచి వాడుకోవాలని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జలాశయాల్లో నీరు లేకపోవడంతో అధికారులు సాగునీటి కంటే కరీంనగర్ నగరం , పరిసర ప్రాంతాల తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

వరుణుడు కరుణిస్తేనే వరి సాగు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా జగిత్యాల జిల్లా పంటలకు అత్యంత కీలకమైన ఎస్సారెస్పీ వరద కాలువలో సాధారణంగా ఆరు మీటర్ల వరకు నీరుండాలి. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే అది కేవలం రెండు మీటర్లకే పరిమితమైంది. దీనివల్ల జిల్లాలో దాదాపు 90 వేల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితి ఇలాగే ఉంటే అధిక నీటిని వినియోగించుకునే వరి లాంటి పంటలను పక్కనబెట్టి, ప్రత్యామ్నాయంగా స్వల్పకాలిక పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

అయినప్పటికీ జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో రైతులు వరి వైపే మొగ్గు చూపుతుండటంతో.. కనీసం ఇకనైనా వరుణుడు కరుణించి రుతుపవనాలు సకాలంలో వస్తాయేమోనని అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా ముందస్తు చర్యలు చేపట్టి, తాగునీటి ఎద్దడి రాకుండా చూడటంతో పాటు తమ సాగు అవసరాలను కూడా కాపాడాలని ఉమ్మడి జిల్లా రైతాంగం కోరుతోంది.

మిడ్ మానేరు డ్యామ్ పూర్తి స్థాయినీటిమట్టం 27.5 టీఎంసీలు కాగా.. ఆయకట్టు విస్తీర్ణం 7.4 టీఎంసీలు ఉంది. ఈ డ్యామ్ తో 4 లక్షల ఎకరాలకు నీళ్లు అందనుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయినీటిమట్టం 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.8 టీఎంసీలు ఉంది. ఈ డ్యాంతో 2  లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఇకలోయర్ మానేరు డ్యామ్ పూర్తి స్థాయినీటిమట్టం 24 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6 టీఎంసీలు ఉంది. ఈ డ్యాంతో 9.8 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఎగువ మానేరు డ్యామ్ ప్రాజెక్టు సామర్థ్యం1 టీఎంసీ కాగా.. ప్రస్తుతం 19 అడుగుల మేర నీళ్లు ఉంది. ఈ డ్యాంతో 6 వేల ఎకరాలకు నీళ్లు అందుతాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>