Mobile Popup Ad
Mobile Popup Ad

మెట్రో రైలు వ్యవస్థలో ఢిల్లీ నంబర్ 1.. హైదరాబాద్ ర్యాంక్ ఎంతంటే?

కలం, వెబ్ డెస్క్ : దేశంలోని ప్రముఖ నగరాల్లో మెట్రో రైలు నెట్‌వర్క్ (Metro Rail Network) వేగంగా విస్తరిస్తోంది. పట్టణ రవాణాను సులభతరం చేస్తూ లక్షలాది మంది ప్రజల ప్రయాణ అవసరాలను మెట్రో తీరుస్తోంది. అధికారిక మెట్రో రైల్ కార్పొరేషన్, ప్రభుత్వ తాజా నివేదికల ప్రకారం, 2026 మే నాటికి దేశంలోని 21 నగరాలు ఆధునిక మెట్రో రైలు వ్యవస్థలతో అనుసంధానించబడ్డాయి. ఈ మెట్రో రైలు మార్గాల మొత్తం పొడవు ఆధారంగా రూపొందించిన తాజా జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ రికార్డు స్థాయిలో 374.47 కిలోమీటర్ల పొడవైన నెట్‌వర్క్‌తో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో ఢిల్లీ తర్వాత కర్ణాటక రాజధాని బెంగళూరు 96.10 కిలోమీటర్ల మార్గంతో రెండో స్థానంలో నిలవగా, మహారాష్ట్ర ఆర్థిక రాజధాని ముంబై 90.47 కిలోమీటర్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా 73.42 కిలోమీటర్లతో నాలుగో స్థానంలో, గుజరాత్‌లోని అహ్మదాబాద్ 67.56 కిలోమీటర్లతో ఐదో స్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ 67.20 కిలోమీటర్ల కార్యాచరణ మెట్రో మార్గంతో దేశంలోనే ఆరో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో ఉన్న అహ్మదాబాద్‌కు, హైదరాబాద్‌కు మధ్య కేవలం స్వల్ప తేడా మాత్రమే ఉండటం గమనార్హం.

మరోవైపు తమిళనాడు రాజధాని చెన్నై 54.10 కిలోమీటర్లతో ఏడో స్థానంలో ఉండగా, నాగ్‌పూర్ 38.22 కిలోమీటర్లతో ఎనిమిదో స్థానంలో, పుణె 31.25 కిలోమీటర్లతో తొమ్మిదో స్థానంలో మరియు నోయిడా 29.70 కిలోమీటర్లతో పదో స్థానంలో నిలిచాయి. ఈ మొదటి పది నగరాల తర్వాత వరుసగా కొచ్చి 27.96 కిలోమీటర్లు, మీరట్ 23.60 కిలోమీటర్లు, లక్నో 22.90 కిలోమీటర్లు, కాన్పూర్ 16.00 కిలోమీటర్లు, గురుగ్రామ్ 12.10 కిలోమీటర్లు, జైపూర్ 11.98 కిలోమీటర్లు మరియు నవీ ముంబై 11.10 కిలోమీటర్ల పొడవుతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

జాబితాలో చివరి వరుసలో ఉన్న నగరాలను పరిశీలిస్తే భోపాల్ 6.22 కిలోమీటర్లు, ఇండోర్ 6.00 కిలోమీటర్లు, ఆగ్రా 5.20 కిలోమీటర్ల మార్గాలను కలిగి ఉన్నాయి. బీహార్ రాజధాని పాట్నా 4.30 కిలోమీటర్లతో ఈ జాబితాలో 21వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మెట్రో రైలు నెట్‌వర్క్ (Metro Rail Network) విస్తరణ పనులు వేగంగా సాగుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ నగరాల్లో మెట్రో మార్గాల పొడవు మరింత పెరగడమే కాకుండా మరిన్ని కొత్త నగరాలు కూడా ఈ జాబితాలోకి చేరే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>