Mobile Popup Ad
Mobile Popup Ad

హీటెక్కిన సింగరేణి గుర్తింపు ఎన్నికలు!

కలం, ఖమ్మం బ్యూరో : కోల్‌బెల్ట్ కోటపై జెండా ఎగరేయడానికి ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. అప్పుడే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల (Singareni Elections) వేడి ప్రారంభమైంది. కార్మిక సంఘాల ఎన్నికలు కేవలం కార్మిక సమస్యలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని రాజకీయ పార్టీల భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుత గుర్తింపు సంఘాల గడువును సెప్టెంబర్ వరకు పొడిగించినప్పటికీ, కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఇప్పటికే పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సింగరేణిలోని 11 మైనింగ్ డివిజన్లకు జరగబోయే ఎన్నికలను తెలంగాణ రాజకీయాల్లో ఒక ‘మినీ జనరల్ ఎలక్షన్’గా రాజకీయ నేతలు, విశ్లేషకులు భావిస్తుంటారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 11 అసెంబ్లీ, 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కోల్‌బెల్ట్ ప్రాంతం విస్తరించి ఉంది. సింగరేణిలో నేరుగా ఓటు హక్కు కలిగిన శాశ్వత కార్మికులు సుమారు 40 వేల మంది ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు, దాదాపు 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్థానిక వ్యాపార వర్గాలను కలుపుకుంటే దాదాపు 4 –5 లక్షల మంది ఓటర్లపై ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది. అందుకే రామగుండం, బెల్లంపల్లి, మంచిర్యాల, కొత్తగూడెం వంటి కీలక నియోజకవర్గాల్లో ‘సింగరేణి సెంటిమెంట్’, కార్మిక సమస్యలు సాధారణ ఎన్నికల గెలుపోటములను కూడా ప్రభావితం చేస్తుంటాయి.

బీఆర్ఎస్ ఓటమి తర్వాత ..

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2012, 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధించి ఏకఛత్రాధిపత్యం కొనసాగించింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం రాజకీయ పరిస్థితులు మారాయి. తదనంతరం జరిగిన సింగరేణి ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ అత్యధిక ఓట్లు సాధించి గుర్తింపు సంఘంగా అవతరించగా, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ ఆరు డివిజన్లలో విజయం సాధించి గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వచ్చే సెప్టెంబర్‌లో జరగనున్న సింగరేణి ఎన్నికల కోసం కొత్త పొత్తులు, పాత శత్రుత్వాలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పట్టు కోసం పార్టీల పోటాపోటీ

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సింగరేణిపై పూర్తి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తున్నది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా రంగంలోకి దిగారు. కార్మికులకు కారుణ్య నియామక పత్రాల పంపిణీ, మెడికల్ బోర్డుల పునరుద్ధరణ వంటి చర్యలతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మరోవైపు, గతంలో సింగరేణిలో బలమైన స్థానం కలిగిన బీఆర్ఎస్ ఈసారి కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నది. ఇక తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అనుబంధ సంఘం కంటే ఎక్కువగా ‘హింద్ మజ్దూర్ సభ’తో కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ‘సింగరేణి బాయి బాట’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆమె సింగరేణి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పాత క్యాడర్‌ను మళ్లీ చురుకుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు.మరోవైపు బీజేపీ ‘సింగరేణి భరోసా యాత్ర’ నిర్వహిస్తున్నది. ఇక కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ కూడా సంస్థలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై విచారణ జరిపిస్తామని హామీ ఇస్తూ కార్మికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు ప్రస్తుత గుర్తింపు సంఘం హోదాలో ఉన్న సీపీఐ, ఏఐటీయూసీ తమ సంప్రదాయ క్యాడర్ ఆధారంగా పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.

అవినీతి, ఆరోపణలే ప్రచారాస్త్రాలు

ఈసారి ఎన్నికల అజెండా కేవలం వేతనాలు, ఉద్యోగ భద్రతకే పరిమితం కాలేదు. దాదాపు రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు నిల్వల మాయపై వస్తున్న ఆరోపణలు, టెండర్లలో అవకతవకలు, సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలు, డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి. అధికార పక్షాలు తమ సంక్షేమ కార్యక్రమాలను ప్రచార అస్త్రాలుగా వినియోగిస్తుండగా, ప్రతిపక్షాలు యాజమాన్య వైఫల్యాలు, అవినీతి ఆరోపణలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ‘సింగరేణి గెలిస్తే.. సింగిడి గెలిచినట్లే’ అనే నానుడిని నిజం చేస్తూ, రాబోయే సింగరేణి ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు 2028 అసెంబ్లీ ఎన్నికల సెమీ ఫైనల్‌గా మారనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బొగ్గు బావుల సాక్షిగా జరగబోయే ఈ హోరాహోరీ పోరులో నల్లబంగారు కార్మికులు ఎటు వైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లోనూ, కార్మిక వర్గంలోనూ నెలకొంది.

పార్టీల నేతల ప్రచారం ఇలా..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా రంగంలోకి దిగి కార్మిక సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేయ‌నున్నారు. ‘సింగరేణి బాయి బాట’ పట్టిన టీఆర్ఎస్ చీఫ్ కవిత ఇప్ప‌టికే ప్ర‌చారంలో బిజీ బిజీగా ఉన్నారు. క్షేత్ర‌స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ పాత క్యాడర్‌ను మళ్లీ యాక్టీవ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సంస్థలో జరిగిన అక్రమాలు, ఆరోపణలపై విచారణ జరిపిస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇస్తూ కార్మికులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>