ఘనాకు షాక్.. స్టార్ ఫుట్‌బాలర్‌కు కెనడా వీసా నిరాకరణ

క‌లం, వెబ్ డెస్క్: ఘనా (Ghana) ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్ తగిలింది. జట్టు స్టార్ మిడ్‌ఫీల్డర్ థామస్ పార్టే (Thomas Partey)కు కెనడా (Canada) వీసా నిరాకరించడంతో ఫిఫా వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. జూన్ 17న పనామాతో జరిగే కీలక పోరులో పార్టే అందుబాటులో ఉండడు. ఈ నిర్ణయంపై ఘనా ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కెనడా తీసుకున్న చర్య అన్యాయంగా ఉందని పేర్కొంటూ అధికారికంగా నిరసన తెలిపింది. వీసా నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కూడా కోరింది.

ప్రస్తుతం స్పెయిన్ క్లబ్ విల్లారియల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 32 ఏళ్ల పార్టేపై యునైటెడ్ కింగ్‌డమ్‌లో అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు కొనసాగుతున్నాయి. అయితే ఆ ఆరోపణలను అతడు ఖండించాడు. ఇంకా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వకముందే వీసా నిరాకరించడం న్యాయసమ్మతం కాదని ఘనా ప్రభుత్వం అభిప్రాయపడింది. వీసా దరఖాస్తు తిరస్కరించబడటంతో అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న ఘనా జట్టు శిబిరం నుంచి కెనడాకు పార్టే వెళ్లలేడని ఫిఫా కూడా ధృవీకరించింది.

అయితే అతడు ఇప్పటికీ జట్టుతోనే ఉన్నాడు. ఇంగ్లాండ్, క్రొయేషియాలతో జరిగే మిగిలిన గ్రూప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవల టోర్నీలో వీసా సమస్యలు ఎదుర్కొన్న వారి జాబితాలో పార్టే కూడా చేరాడు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, అధికారులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కెనడా నుంచి వచ్చే స్పందన కోసం ఘనా ఎదురుచూస్తోంది. మరోవైపు తమ అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు లేకుండానే తొలి మ్యాచ్‌కు జట్టు సిద్ధమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>