కలం, ఖమ్మం బ్యూరో: వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah).. ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు. కానీ ఆయన లక్ష్యాలు, ఆశయాలు ఆచరించేవారెందరో. ఆయన ఇన్‌స్పిరేషన్‌తో ఓ బుడ్డొడు మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం (Kothagudem) పట్టణానికి చెందిన విశ్వామిత్ర చౌహాన్ అనే ఏడేళ్ల బాలుడు 1388 మొక్కలు నాటాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాక్ ఫర్ ట్రీస్ అనే కాన్సెప్ట్‌తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్నాడు. 2022 జూన్ 2 నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
కొత్తగూడెంలోని నవ భారత్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విశ్వామిత్ర (Vishwamitra Chauhan) మొక్కలు నాటడం పనిగా పెట్టుకున్నాడు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా శనివారం కొత్తగూడెంలోని (Kothagudem) అటవీ ప్రాంతంలో తన తమ్ముడితో కలిసి మొక్కలను నాటాడు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ.. చెట్లను నరకడంతో కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బ తింటుందని, జీవ వైవిధ్యం కొనసాగాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నాడు. ప్రతిఒక్కరూ ఏడాదికి కనీసం 12 మొక్కలు నాటాలని కోరాడు. పర్యావరణంపై ఈ బాలుడికి ఉన్న శ్రద్ధను చూసి పలువురు అభినందిస్తున్నారు.
Read Also: సింపుల్ అలవాట్లతో 30కేజీల బరువు తగ్గిన న్యూట్రీషనిస్ట్..
Follow Us On: Facebook

