కలం, నల్లగొండ: రానున్న ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని నల్గొండ (Nalgonda) జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరానికి అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించింది. శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు (Screening Test) జిల్లా వ్యాప్తంగా 2,250 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన 500 మంది అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి, నల్గొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో వారికి సమగ్ర ఉచిత శిక్షణ అందించనున్నారు.
ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. ఖాకీ దుస్తులు ధరించి సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న యువతకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ అందించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగం కేవలం జీవనోపాధి మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా సబ్జెక్ట్ నిపుణులతో ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు అవసరమైన తరగతులు నిర్వహించడంతో పాటు క్రమం తప్పకుండా మోడల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఈవెంట్స్‌లో రాణించేందుకు అవసరమైన ఫిజికల్ ఫిట్‌నెస్‌పై కూడా మార్గదర్శకత్వం అందిస్తామన్నారు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికైన 500 మంది అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమించి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకాంక్షించారు.

