కలం, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కారుపై దాడి ఘటన విషయం తెలుసుకున్న పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదు. హింసా రాజకీయాలు ఆయనకు కొత్తేం కాదు. రాష్ట్రాన్ని జంగిల్రాజ్లా మార్చేశారు. లోక్సభ ఎంపీకే భద్రత లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటీ..? రెండేళ్లుగా చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని.. ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతానేమోనని అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారు. అధికార దుర్వినియోగంతో పోలీసులను వాడుకుని అక్రమాలు చేస్తున్నారు’ అని విమర్శించారు.
కోర్టును ఆశ్రయిస్తాం..
సీఎం చంద్రబాబు తన పోలీసులతో ఎన్నికలను నిజాయితీగా నిర్వహించలేరని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘ఈ ఘటనపై కోర్టును ఆశ్రయిస్తాం. రాష్ట్ర పోలీసులతో సంబంధం లేకుండా కేంద్ర పారామిలటరీ బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతాం. అప్పుడు మాత్రమే సక్రమంగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై చట్టపరంగా పోరాడుతాం. ధైర్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం. హింసతో రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేయాలని భావిస్తున్నారు’ అన్నారు.

