కలం, వెబ్డెస్క్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో (AP Local Elections) కూటమి ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని, కొన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులను చంపేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో తమ పార్టీ ఎంపీ మీద కర్రలు, రాళ్లతో దాడి చేసేంత దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో కూటమి నేతలు పోలీస్ వ్యవస్థను, ఎన్నికల అధికారులను, రెవెన్యూ అధికారులను, ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలను వాడుకొని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడతారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తుంటే భవిష్యత్తులో ఎన్నికలు ఎలా ఉంటాయో అర్థం అవుతోందన్నారు.
చంద్రబాబు (Chandrababu) లాగా ఎన్నికలను బహిష్కరించి వెళ్లిపోము అని, ఏ ఆపద వచ్చినా పోటీ చేసి తీరుతామని గుడివాడ (Gudivada Amarnath) స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా దుర్మార్గంగా వ్యవహరించినా ప్రజల అంగీకారంతో, ప్రజల కోసం ముందుకు వెళ్తామన్నారు. స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగేలా లేవని వ్యాఖ్యానించారు. పుంగనూరు, రాయచోటిలో ఘటనలను తీవ్రంగా ఖండించారు. తమకు జగన్ అండ ఉందని, అన్నింటికి తెగించి బరిలోకి దిగుతామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రం స్పందించాలని, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. వైసీపీ అభ్యర్థులకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
Also Read : తీవ్ర విషాదం.. రిజర్వాయర్లో పడి ఐదుగురు మహిళల మృతి
Follow Us On: Youtube

