కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రజలు పోలీసులను చూసి భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ధ్వజమెత్తారు. ‘హలో ఇండియా..’ అంటూ ఆయన ఎక్స్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి, ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. కస్టడీలో మరణించిన గాదే సాయి కృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేయడం, పోలీసుల వేధింపులపై క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకోవడం వంటి మరెన్నో సంఘటనలు చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన రెడ్ బుక్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. హోం మంత్రి, డీజిపీ వరుస ఘటనలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
సాయి కృష్ణ ఉదంతం కలిచివేసింది..
చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఒక్కో వర్గాన్ని టార్గెట్ చేసి వేధిస్తూ వస్తోందని జగన్ మండిపడ్డారు. మొదట రాజకీయ ప్రత్యర్థులు, తరువాత సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారన్నారు. తరువాత జర్నలిస్టులు, మేధావులు, ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా వేధింపులు, బెదిరింపులకు గురవుతున్నారని ఆరోపించారు. సాయి కృష్ణ కేసు రాష్ట్రాన్ని కదిలించిందని, అతడి తల్లి తన కుమారుడి బూడిద అయినా ఇవ్వాలని అధికారులను వేడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి భయానక పరిస్థితి ఇంతకు ముందెన్నడూ జరగలేదన్నారు.
పోలీసులే జడ్జిల్లా మారిపోయారు..
కూటమి ప్రభుత్వంలో పోలీసులే జడ్జిల్లా మారిపోయారని జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్రాంతి కుమార్ అనే వ్యక్తి పోలీసుల వేధింపులను పూసగుచ్చినట్లుగా వివరించారని, తునిలో తిరుపతమ్మ, శ్రీకాకుళం జిల్లాలో కళావతి, కర్నూలు జిల్లాలో గంగమ్మ ఘటనలను పరిశీలిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. వైసీపీ నేతలు పూర్తి సాక్ష్యాలతో వెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పాలన జరగాలని, రెడ్ బుక్ పాలన ప్రకారం కాదని స్పష్టం చేశారు. అధికారం చట్టాన్ని భర్తీ చేస్తే, చివరికి ప్రజాస్వామ్యమే బలవుతుందని జగన్ హెచ్చరించారు.

