కామన్వెల్త్‌లో యమిని గురి.. భారత్‌కు మరో పతకమే లక్ష్యం

కలం, స్పోర్ట్స్ : ఎఫ్‌ఐఎస్‌యూ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత జూడోకా యమిని మౌర్య (Yamini Maurya) .. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌కు సిద్ధమైంది. గ్లాస్గో వేదికగా మరోసారి భారత్‌కు పతకం అందించడమే ఆమె లక్ష్యం. 57 కిలోల మహిళల విభాగంలో యమిని మౌర్య భారత టాప్ జూడోకాల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. ఎఫ్‌ఐఎస్‌యూ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జూడోకాగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఆఫ్రికన్ ఓపెన్‌, ఆసియన్ ఓపెన్‌లోనూ బంగారు పతకాలు సాధించింది.

అదే ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ బరిలోకి దిగుతోంది. జూడోలో ముందున్న మ్యాచ్ గురించే ఆలోచించాలని యమిని తెలిపింది. ప్రతి పోరు కొత్త సవాలేనని చెప్పింది. శిక్షణ బాగా జరిగిందని, ఇప్పుడు ప్రశాంతంగా ఆడి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టానని వివరించింది. అంతర్జాతీయ టోర్నీల్లో ఆడిన అనుభవం తనను మరింత మెరుగైన క్రీడాకారిణిగా మార్చిందని యమిని పేర్కొంది. ప్రతి పోటీ కొత్త పాఠం నేర్పిందని, ఒత్తిడిలో ఎలా ఆడాలో ఆ అనుభవాలే నేర్పాయని చెప్పింది.

ఇన్‌స్పైర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్‌లో శిక్షణ పొందడం తనకు పెద్ద బలమని వెల్లడించింది. పోషకాహారం, ఫిజియోథెరపీ, రికవరీ, శిక్షణ అన్నీ ఒకే చోట అందుబాటులో ఉండటంతో పూర్తిగా జూడోపై దృష్టి పెట్టగలుగుతున్నానని తెలిపింది. ఇతర క్రీడాకారులతో కలిసి సాధన చేయడం కూడా మరింత ప్రేరణ ఇస్తోందని వివరించింది. భారత్ జెర్సీ ధరించడం ఎప్పుడూ గర్వకారణమేనని యమిని పేర్కొంది. ప్రతి పోరులో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతానని, దేశానికి మరోసారి గర్వకారణంగా నిలవాలని ఆశిస్తున్నానని తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>