వైటీపీఎస్ వద్ద భూ బాధితుల ఆందోళన

కలం, దామరచర్ల : నల్లగొండ జిల్లా దామరచర్ల (Damercherla) మండలం తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS) వద్ద భూ బాధితులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన తమకు ఇప్పటివరకు సరైన పరిహారం అందలేదని, అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఆరోపిస్తూ బాధితులు పెద్ద సంఖ్యలో ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు.

ప్లాంట్ పరిధిలో భూసేకరణ, ఎన్‌క్రోచ్‌మెంట్‌కు సంబంధించిన సమస్యలు ఏళ్లుగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ప్లాంట్ యాజమాన్యానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడంతోనే ఆందోళనకు దిగినట్లు తెలిపారు. “మా భూములను తీసుకుని ప్లాంట్ నిర్మించారు. కానీ పరిహారం విషయంలో పత్రాల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. భూములు కోల్పోయిన స్థానిక కుటుంబాలకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి సమస్యలు విని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తాం” అని భూ బాధితులు తెలిపారు.

భారీ సంఖ్యలో బాధితులు ప్లాంట్ గేటు వద్దకు చేరుకోవడంతో పోలీసులు, వైటీపీఎస్ భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూ బాధితులకు న్యాయమైన పరిహారం అందించి, అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రజాసంఘాలు, స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉండేలా పోలీసులు మోహరించి పర్యవేక్షిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>