కలం, కరీంనగర్ బ్యూరో : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ధి కార్యక్రమాలను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా శివకిరణ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ‘మన ఊరు–మన కోచింగ్ సెంటర్’ ఉచిత కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో టీ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి హెల్మెట్‌లను పంపిణీ చేశారు.
మంథని క్యాంపు కార్యాలయంలో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్, ఇతర పరిశ్రమల ప్రతినిధులు, కలెక్టర్, అధికారులతో కలిసి పరిశ్రమల అభివృద్ధి అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థ సీఎస్‌ఆర్ కార్యక్రమం ‘ప్రాజెక్ట్ షైన్’ కింద చేపడుతున్న బొక్కలవాగు చెక్‌డ్యామ్ అప్‌గ్రేడేషన్, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో నూతన డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని వైద్య సేవల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. రత్నాపూర్ గ్రామంలో ప్రతిపాదిత కోకాకోలా పరిశ్రమ ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు.
ఉద్యోగం సాధించే వరకు అండగా ప్రభుత్వం
‘మన ఊరు–మన కోచింగ్ సెంటర్’ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ప్రస్తుతం మరో 7 వేలకుపైగా పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత పూర్తిగా వినియోగించుకోవాలని, రాబోయే మూడు నెలలు జీవితాన్ని మార్చే కాలంగా భావించి స్పష్టమైన లక్ష్యంతో సిద్ధం కావాలని సూచించారు. కోచింగ్ సెంటర్‌లో అత్యుత్తమ శిక్షణతో పాటు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్, వసతి, భోజన సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
బొక్కలవాగు అభివృద్ధితో నీటి సంరక్షణ
బొక్కలవాగు వద్ద గార్డెనింగ్, ఓపెన్ జిమ్ అప్‌గ్రేడేషన్, వాకింగ్ ట్రాక్, చిన్నారుల కోసం పార్కు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా బొక్కలవాగులో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు డీ-సిల్టింగ్ పనులు కూడా చేపడుతున్నామని చెప్పారు. బొక్కలవాగు బండ్ అభివృద్ధి పనులకు గతంలో 2011-12లో అనుమతులు లభించాయని, ప్రస్తుతం వాటిని ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. ఈ అభివృద్ధి పనులను సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా చేపట్టాలని హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థను కోరగా, సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించి రూ.2 కోట్ల నిధులు అందించారని మంత్రి పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా నీటి సంరక్షణ మెరుగుపడటంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బొక్కలవాగు సుందరీకరణ, గార్డెనింగ్, డీ-సిల్టింగ్, వాకింగ్ ట్రాక్, జిమ్, చిన్నారుల పార్కు తదితర అభివృద్ధి పనులను అత్యున్నత నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రత్నాపూర్ గ్రామంలో ప్రతిపాదిత కోకాకోలా పరిశ్రమ ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, సంబంధిత శాఖల అధికారులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి మంత్రి పరిశీలించారు.
మంథని అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మంథని పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పలు మౌలిక వసతుల పనులను ప్రభుత్వం ప్రాధాన్యతతో చేపడుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో సురేష్ , మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, సయేందర్ రెడ్డి, తహసీల్దార్ ఆరిఫ్ ఉద్దీన్, ప్రజాప్రతినిధులు, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రతినిధులు, ఇతర పరిశ్రమల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

