కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో (Yadadri Temple) పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తానని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఉద్యోగ భద్రత, సంక్షేమానికి సంబంధించిన కీలక డిమాండ్లపై జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల ప్రతినిధులు వివరించిన సమస్యల పట్ల ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సానుకూలంగా స్పందించారు. యాదాద్రి దేవాలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను బోర్డు దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 15 రోజుల వ్యవధిలో సమస్యల పరిష్కారంలో స్పష్టమైన పురోగతి సాధించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఉద్యోగుల సంక్షేమం పట్ల చూపిన సానుకూల స్పందన పట్ల యాదాద్రి ఆలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట మునిసిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ముక్కెర్ల మల్లేశ్, కౌన్సిలర్, సాధునేని ధనలక్ష్మి మధుకర్, ఉద్యోగులు యూనియన్ అధ్యక్షులు కైరంకొండ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

