కలం, వనపర్తి: లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, సుభిక్షం, ఆయురారోగ్యాల కోసం యాగాలు కీలక పాత్ర పోషిస్తాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) అన్నారు. వనపర్తి (Wanaparthy) పట్టణంలో శ్రీశ్రీశ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 15 రోజులపాటు నిర్వహించనున్న ‘విశ్వశాంతి మహాయాగం’ (Vishwashanti Maha Yagam) సంకల్పం అభినందనీయమని పేర్కొన్నారు.
బుధవారం నిర్వహించిన ఆయుత చండీయాగం హోమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వాసంతి నిరంజన్‌రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రోచ్ఛారణలతో దంపతులను ఆహ్వానించి పట్టు వస్త్రాలు బహూకరించారు. పూర్ణాహుతి అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ మహాయజ్ఞంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రజల శ్రేయస్సు కోసం సంకల్పించిన శ్రీ సీతారామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, గంధం పరంజ్యోతి, సునీల్ వాల్మీకి, చిట్యాల రాము, మంద రాము, లక్ష్మణ్ గౌడ్, శివ గౌడ్, కందూరు కేశవులు, భేదిడి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

