కలం, వనపర్తి: రాజీ మార్గం ద్వారా కేసులను సత్వరమే పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు అన్నారు. శనివారం వనపర్తి (Wanaparthy) జిల్లా ప్రధాన న్యాయస్థానం ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ జాతీయ లోక్ అదాలత్లో వివిధ రకాల కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ‘‘రాజీ మార్గమే రాజమార్గం’’ అని పేర్కొన్నారు.
లోక్ అదాలత్ (Lok Adalat) ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాలకు త్వరితగతిన న్యాయం లభిస్తుందన్నారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని సూచించారు.
6,617 కేసులకు పరిష్కారం..
వనపర్తిలో నిర్వహించిన 3వ జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 6,617 కేసులు రాజీ అయ్యాయి. వీటిలో 1,639 క్రిమినల్, 19 సివిల్, 4,959 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. పరస్పర అంగీకారంతో కేసుల పరిష్కారం వల్ల కోర్టుల్లో పెండింగ్ కేసుల భారం తగ్గడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని న్యాయమూర్తి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి, అదనపు జిల్లా జడ్జి కె. లావణ్య బాలరెడ్డి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి. కలర్చన, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె. కవిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీపా కాసరగడ్డ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

