మిర్యాలగూడ ఆసుపత్రిలో వసతులు కల్పించాలి: ఎమ్మెల్సీ

కలం, మిర్యాలగూడ: మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో తక్షణమే ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, వెంటిలేటర్ వంటి అత్యవసర వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ (MLC Kethavath Shankar Naik) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రికి వచ్చే నిరుపేద, గిరిజన రోగుల కష్టాలను ప్రభుత్వం తీర్చాలన్నారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్య సేవల పరిస్థితిని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో విద్య, వైద్యం రెండూ అత్యంత కీలకమైన అంశాలని పేర్కొన్నారు. విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల తరహాలోనే, వైద్య రంగంలోనూ సామాన్యులకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. మిర్యాలగూడతో పాటు పొరుగున ఉన్న నాగార్జునసాగర్, దేవరకొండ, హుజూర్‌నగర్ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు వైద్యం కోసం ఇక్కడికే వస్తుంటారని తెలిపారు.

ముఖ్యంగా పేదలు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు ఈ ఆసుపత్రిపైనే ఆధారపడి ఉన్నారన్నారు. తీవ్రమైన అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఆసుపత్రి (Mriyalguda Area Hospital)లో స్కాన్లు, వెంటిలేటర్ వసతులు లేకపోవడంతో వేరే ప్రాంతాలకు రిఫర్ చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల నిరుపేదలు ఆర్థికంగా, శారీరకంగా నష్టపోతున్నారన్నారు. అలాగే ప్రసవాల కోసం వచ్చే గర్భిణులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండలిలో వివరించారు.

తక్షణమే సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, వెంటిలేటర్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, ప్రసూతి విభాగాన్ని మరింత బలోపేతం చేసి, అవసరమైన పరికరాలు, నిపుణులైన సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ సదుపాయాలు కల్పిస్తే పేద ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉచిత వైద్యం అందుతుందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>