కలం, వెబ్ డెస్క్ : వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభవార్త తెలిపింది. హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ భారీ స్థాయిలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నుండి సెప్టెంబర్ 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి వెల్లడించారు.
జేబీఎస్ (JBS), ఎంజీబీఎస్ (MGBS) మీదుగా సాగే ఈ రవాణా సౌకర్యాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రత్యేక బస్సులు జేబీఎస్ నుండి ప్రారంభమై ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్, ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీ భవన్, అఫ్జల్గంజ్, సీబీఎస్/ఎంజీబీఎస్, విమెన్స్ కాలేజ్, జె.గార్డెన్, గవర్నమెంట్ ప్రెస్, ఐ.ఎస్. సదన్, పిసల్బండ, మిధాని టి.షిప్, బాలాపూర్ ఎక్స్ రోడ్, శివాజీ చౌక్ల మీదుగా బాలాపూర్ గణేష్ మండపానికి చేరుకుంటాయి.
భక్తుల రద్దీకి అనుగుణంగా జేబీఎస్ వద్ద ఉదయం 6 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 21:55 గంటల వరకు ప్రతి 40 నుండి 50 నిమిషాల వ్యవధితో నిరంతరాయంగా బస్సులు నడుస్తాయి. అలాగే బాలాపూర్ గణేష్ మండపం నుండి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 గంటలకు ప్రారంభమై రాత్రి 23:50 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ( TGSRTC) యాజమాన్యం వెల్లడించింది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గణేష్ ఉత్సవాల (Ganesh Festival) వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎండీ నాగిరెడ్డి వివరించారు.

