కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లిలోని(Erravalli) కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద పసుపు నీళ్ల శుద్ధి అంశం (Turmeric Water Row) రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేతలు ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వైపు “వేయి డప్పుల” నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులు ఆ మార్గంలో నడిచి వెళ్లిన తర్వాత, ఆ రహదారులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పసుపు నీటితో శుద్ధి (సంప్రోక్షన) చేయడం వివాదంగా మారింది.
దళితులు నడిచినందుకే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే రోడ్లపై పసుపు నీళ్లు చల్లి, అపవిత్రం అయ్యాయంటూ శుద్ధి చేయడం తమను, సమాజంలోని దళితులను తీవ్రంగా అవమానించడమేనని కాంగ్రెస్ దళిత నేతలు మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ SC, ST విభాగాలు, ప్రజాసంఘాలు పలు పోలీస్ స్టేషన్లలో, పోలీస్ ఉన్నతాధికారులకు రాతపూర్వక ఫిర్యాదులు అందించాయి. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు గజ్వేల్ ఏసీబీ సమక్షంలో, స్థానిక పోలీసు అధికారుల ఆధ్వర్యంలో సమగ్ర విచారణ ప్రారంభమైంది. విచారణలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు పసుపు నీళ్లు జల్లిన పలు ప్రాంతాలను, క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించారు. ఘటన జరిగిన ప్రాంతం నుండి ఫోరెన్సిక్ (FSL) నిపుణుల బృందం సాంకేతిక ఆధారాలను, నమూనాలను సేకరిస్తుంది.
ఈ అంశం అసెంబ్లీలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తుండగా, BRS మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ కేవలం చావుడప్పు నిరసనను నిరసిస్తూ చేసిన చర్యగా పేర్కొంటోంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.

