కలం, కరీంనగర్ బ్యూరో: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు చివరకు మోక్షం లభించింది. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం గురువారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి సమర్పించిన విజ్ఞప్తికి సానుకూల స్పందన లభించింది. పెండింగ్‌లో ఉన్న రూ. 35.19 కోట్ల అంచనా వ్యయ పనులను తక్షణమే పునఃప్రారంభించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సహకారంతో రూ. 35.19 కోట్ల నిధులతో గతంలో శంకుస్థాపన జరుపుకున్న పలు పనులు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి. ఈ విషయంపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శ్రద్ధ వహించి సీఎం దృష్టికి తీసుకురావడంతో సమస్య కొలిక్కి వచ్చింది.
ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చే మాలాధారుల సౌకర్యార్థం ఒకేసారి 2,000 మంది భక్తులు దీక్ష విరమణ చేసేలా అత్యాధునిక వసతులతో భారీ మండపం నిర్మించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం 96 గదులతో కూడిన నూతన సత్రం (అతిథి గృహం) అందుబాటులోకి రానుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. నిధుల వినియోగంపై ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తామని, నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

