కలం, కరీంనగర్ బ్యూరో: సిద్దిపేట భూములకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు చేస్తున్నవన్నీ ఊహాజనిత రాజకీయ డ్రామాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబంతో సహా భూరాబందులుగా మారిన బీఆర్ఎస్ నేతలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా అని ఆయన సవాల్ విసిరారు. మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఖరిని ఎండగడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సిద్దిపేట డ్రామాలు ఎందుకు?
సిద్దిపేట భూకబ్జాలపై ఆధారాలన్నీ ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ నేతలను రోడ్లపైకి ఉసిగొల్పడం వెనుక అంతరార్థమేమిటి? మీ దగ్గర నిజంగా ఆధారాలుంటే ఆ భూములను వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని కబ్జాదారులను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌తో డీల్ కోసమే ‘సెట్’?
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం చేతగాక, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలతో పొలిటికల్ నాటకాలకు తెరలేపాయి. కేసీఆర్, ఆయన అనుచరులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకోవడానికే అసెంబ్లీలో స్పెషల్ ఎంక్వైరీ కమిషన్ (SET) వేశారా అని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.
భూ ఆక్రమణలపై దండయాత్ర..
కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాల యజమాని కానేకాదని ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమవుతోందని, ఆయన గతమంతా భూదందాలు, ఆక్రమాల్లోనే గడిచిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా చేసిన భూదోపిడీపై త్వరలోనే బీజేపీ తరఫున భారీ దండయాత్ర చేస్తామని, ఆ ఆక్రమిత భూముల్లో కాషాయ జెండాలు పాతి పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని, తెలంగాణ ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకు కలిసి నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ భూదోపిడీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగే అవినీతిపై కూడా కఠిన విచారణ జరిపిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

