ఆర్టీసీకి ఏదీ గ్యారంటీ?

కలం, తెలంగాణ బ్యూరో: ‘ప్రజల రథం.. ప్రగతి పథం’.. ఇదీ తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) నినాదం. కానీ ఆర్టీసీలో, ఆ సంస్థ కార్మికుల జీవితాల్లో ప్రగతి మాత్రం లేదు. ఆర్టీసీ పురోగతి ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు.. ఇలా కార్మికులే ఉండే ఈ సంస్థలో ట్రేడ్ యూనియన్లే లేవు. గత ప్రభుత్వంలో కేసీఆర్ పుణ్యమా అని అవి రద్దయ్యాయి. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం అని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి రెండున్నరేండ్లయినా పునరుద్ధరణ లేదు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్రను మరువలేం. సుదీర్ఘమైన సమ్మెతో రాష్ట్ర ఏర్పాటులో వారి పాత్ర తెలంగాణ ప్రజలకు స్వీయానుభవం. స్వరాష్ట్రంలో సమస్యలు తీరుతాయని, హక్కులు లభిస్తాయని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. డిమాండ్ల పరిష్కారం సంగతేమో గానీ వారికి అప్పటివరకూ ఉన్న ‘గుర్తింపు యూనియన్’ హక్కు కూడా లేకుండాపోయింది.

కొత్త ప్రభుత్వంలోనైనా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశించిన TGSRTC కార్మికులు, ఉద్యోగులకు సమ్మె తప్ప మరో మార్గం లేకుండా పోయింది. కేసీఆర్ హయాంలో 52 రోజుల సమ్మె కాలంలో 34 మంది చనిపోయారు. రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో రిక్రూట్‌మెంట్లు లేవు. డ్రైవర్లు, కండక్టర్లపై పని ఒత్తిడి పెరిగింది. 8 గంటల పని విధానం స్థానంలో ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తున్నది. గత ప్రభుత్వంలో అమలైన ‘విభజించు-పాలించు’ విధానమే ఇప్పుడూ కొనసాగుతున్నది.

కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి లేవు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేట్ సంస్థలు చొచ్చుకొచ్చాయి. చాలా డిపోల్లో ‘హైర్ బస్’ సిస్టమ్ కంటిన్యూ అవుతున్నది. 2017, 2021 పీఆర్సీ బకాయిల పేమెంట్ ఊసే లేదు. 2017 పీఆర్సీ ప్రకటించినా అలవెన్సులు అందలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదన కమిటీల పేరుతో కాలయాపన అవుతున్నది. మెడికల్/అన్‌ఫిట్/డెత్ స్టాఫ్ పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాల డిమాండ్ పెండింగ్‌లోనే ఉన్నది. ఇలాంటి అనేక డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కలం 360 డిగ్రీస్ స్పెషల్.. పేజ్ కోసం కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ‘నా కొడకా..’ అంటూ రేవంత్ పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>