కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్–విజయవాడ హైవేపై ఉన్న పలు హోటళ్లలో టీజీ సేఫ్ (TG SAFE) విభాగానికి చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కోదాడ నుంచి కొయ్యలగూడెం వరకు ఉన్న హోటళ్లలో బృందాలుగా విడిపోయి తనిఖీలు చేశారు. కిచెన్ పరిసరాలు పూర్తి అపరిశుభ్రంగా ఉండటంతో నాసిరకమైన ఆహార పదార్థాలు, పప్పులకు పురుగులు పట్టి ఉండటాన్ని గుర్తించారు. చికెన్, మటన్ వంటి మాంసహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయడం లేదని గమనించారు. వండిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచి కస్టమర్లకు పెడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కిచెన్ గదిలో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నాయి. నిల్వ ప్రదేశాల్లో కూడా ఏమాత్రం పరిశుభ్రత పాటించడం లేదు.
హోటళ్లకు నోటీసులు జారీ..
ఈ నేపథ్యంలో పలు హోటళ్లను సీజ్ చేయడం, మరికొన్నింటి లైసెన్సులు రద్దు చేసి నోటీసులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. దసరా పండుగ నేపథ్యంలో హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో వాహనదారులు మధ్యలో ఆగి హోటళ్లలో భోజనాలు చేస్తుంటారు. భారీగా జనాలు వస్తుండటంతో హోటళ్లు కూడా నాణ్యత లేకుండా ఆహార పదార్థాలు అందిస్తున్నట్లు పక్కా సమాచారం అందిడంతో తనిఖీలు చేసినట్లు సమాచారం.

