కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem ) జిల్లాను ఎడారిగా మారుస్తున్నారని తెలంగాణ రైతు సంఘం (Telangana Rythu Sangham) జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ఆరోపించారు. శనివారం చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు కాలువలను రైతు సంఘం బృందం పరిశీలించింది.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ… సీతారామ ప్రాజెక్టు కాలువల తవ్వకం పూర్తి చేయకుండా, రోజుకు 7,000 క్యూసెక్కుల నీటిని సాగర్ కెనాల్‌లోకి తరలించడం అన్యాయమన్నారు.
దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని 24,700 ఎకరాలకు సాగునీరందించే తాలిపేరు నీటిని దారి మళ్లించడం వల్ల ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. మంత్రులు తమ నియోజకవర్గాలనే అభివృద్ధి చేసుకుంటూ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.సంఘం సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్ మాట్లాడుతూ… మాజీ ఎమ్మెల్యే మోర్ల ఎర్రయ్య రెడ్డి హయాంలో నిర్మించిన తాలిపేరు ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.
తాలిపేరు మేజర్, మైనర్ కాలువల పూడిక తీసి రిపేర్లు చేపట్టాలని, సీతారామ కాలువలకు నిధులు కేటాయించి ఈ సీజన్‌లోనే నీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే మంత్రుల ఆదేశాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలమంచి వంశీకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

