కలం, నల్లగొండ బ్యూరో : సూర్యాపేట జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా (DG Soumya Mishra) పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా నుంచి రోడ్డు భద్రతపై నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం పిల్లలమర్రి వద్ద బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించారు. ఆ తర్వాత రుద్రంగి కన్వెన్షన్ హాల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రతపై నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదని ఆమె హెచ్చరించారు. ఓవర్ స్పీడింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి కారణాలతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో 2023లో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 4.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
యువత అధిక వేగంతో వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని, వేగం తగ్గిస్తే సగానికి పైగా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ఆమె (DG Soumya Mishra) పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు, జైళ్ల శాఖ అధికారులు, ఆర్టీసీ, ఆర్టీవో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: లోక్ సభలో వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు
Follow Us On: X(Twitter)

