కలం, నేషనల్ డెస్క్: అమెరికా పౌరసత్వం కోసం నిరీక్షిస్తున్న భారతీయ ప్రొఫెషనర్లకు ఇదొక షాకింగ్ న్యూస్. సెప్టెంబర్ 30తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ ఈబీ-1 (EB1) విభాగంలో భారతీయులకు గ్రీన్ కార్డులు (Green Card) నిలిచిపోయే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది. టాలెంట్ ఉన్నవారు, ప్రొఫెసర్లు, రీసెర్చర్లు, మల్టీనేషనల్ కంపెనీల్లో పని చేసే మేనేజర్లకు ఇచ్చే ఈబీ-1 గ్రీన్ కార్డుల (EB1 Green Card) కోసం భారతీయ నిపుణుల నుంచి భారీ దరఖాస్తులు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇండియాకు కేటాయించిన కోటా పరిమితి త్వరలోనే ముగిసిపోనున్నదని, రాబోయే కొద్ది వారాల్లో ఈ కేటగిరీ సేవలు అందుబాటులో లేకుండా పోవచ్చని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తన సెప్టెంబర్ ‘వీసా బులెటిన్’ ద్వారా స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ఈబీ-1 కేటగిరీకి సంబంధించి ఫైనల్ యాక్షన్ డేట్ 2022 అక్టోబర్ 15గా ఉంది. అంటే ఈ తేదీ కంటే ముందు ప్రయారిటీ డేట్ ఉన్నవారికి మాత్రమే వీసాలు మంజూరవుతాయి.
ఈబీ–3 కేటగిరీకి 12 ఏండ్ల వెయిటింగ్
ఉన్నత చదువులు, నైపుణ్యం ఉన్న వారి కోసం కేటాయించిన ఈబీ 2(EB-2 Visa) కేటగిరీలో వీసాలు సెప్టెంబర్ నెలకు ‘అందుబాటులో లేవు’ అని నివేదిక పేర్కొన్నది. ఈబీ-3 కేటగిరీలో దరఖాస్తుదారుల నిరీక్షణ కాలం ఏకంగా 12 ఏండ్లకు పైగా ఉంది. ఈబీ-5 కేటగిరీ కింద వచ్చే ఇన్వెస్టర్ల విభాగంలోనూ వీసాలు నిలిచిపోయాయి.
అయితే గ్రామీణ ప్రాంతాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులకు మాత్రం సడలింపులు కొనసాగుతున్నాయి. ప్రతీ ఏడాది జారీ చేసే జాబ్ బేస్డ్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై ఉన్న చట్టబద్ధమైన పరిమితులు, ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న దరఖాస్తుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా అధికారులు తెలిపారు.
Also Read : భారీ యంత్రాలు దించినా.. అంగుళం కదలని ఆంజనేయుడు
Follow Us On: X(Twitter)

