మాటిచ్చి 24 గంటలు కాకముందే.. గిరిజన హాస్టల్‌కు నీరు

కలం, ​దమ్మపేట : అధికారులు హామీలు ఇవ్వడం సహజమే కానీ ఇచ్చిన మాట ప్రకారం గడువులోగా సమస్యను పరిష్కరించి చూపడమే అసలైన ప్రజాసేవ అని నిరూపించారు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ), తహశీల్దార్ మద్దినేని మురళి (Maddineni Murali). దమ్మపేటలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో (Dammapeta Tribal Hostel) నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని ఆయన కేవలం 24 గంటల వ్యవధిలోనే పరిష్కరించి విద్యార్థుల పాలిట నిలువెత్తు ఆపద్భాంధవుడిగా నిలిచారు.

ఇచ్చిన మాట ప్రకారం కొత్త బోరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని వసతి గృహంలో ఏళ్లకు ఏళ్లుగా బోరు మోటార్ మూలనపడటం, మరోవైపు మిషన్ భగీరథ నీటి సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడటంతో గత మూడు రోజులుగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ) మురళి బుధవారం సాయంత్రం వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన.. “గురువారం ఉదయం 11 గంటల్లోగా మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా” అని హామీ ఇచ్చారు.

హామీకి ముందే పరిష్కారం

ఇచ్చిన హామీ మేరకు రాత్రికి రాత్రే కొత్త బోరు తవ్వకానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయానికి కొత్త బోరు తవ్వించి, నీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. అధికారుల సమక్షంలో బోరు పనులను స్వయంగా పర్యవేక్షించిన మురళి, హామీ ఇచ్చిన 24 గంటల వ్యవధి పూర్తికాకముందే వసతి గృహానికి నీటి సదుపాయం కల్పించారు.​ ఇక డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ) స్పందించిన తీరు, చూపిన చొరవపై విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తూ అధికారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, ఉప సర్పంచ్ ఆంగోత్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>