కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లాలోని బొంగులూరు శ్రీ చైతన్య కళాశాల క్యాంపస్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెలవు ఇవ్వలేదన్న మనస్తాపంతో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్. కార్తీక్ అనే విద్యార్థి (Sri Chaitanya Student) బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తమ ఇంట్లో గృహప్రవేశం ఉండటంతో సెలవు కావాలని కార్తీక్ కళాశాల ప్రిన్సిపాల్‌ను కోరాడు. అయితే ప్రిన్సిపాల్ అందుకు అనుమతి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి, తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం తెలిసిన వెంటనే తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

