కలం, ఖమ్మం బ్యూరో: రెస్టారెంట్లో పని చేస్తున్న వర్కర్‌పై యజమాని దాడి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha)లో తీవ్ర కలకలం రేపింది. యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వర్కర్ కుటుంబసభ్యులు సోమవారం రెస్టారెంట్ ఎదుట ఆందోళనకు దిగారు. స్థానిక స్పైసీ రెస్టారెంట్ (Spicy Restaurant) లో సప్లై బాయ్‌గా పని చేస్తున్న చలపతిరావుపై గాంధీ జయంతి రోజున అర్ధరాత్రి వేళ విధుల్లో ఉన్నప్పుడే యజమాని భౌతిక దాడికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సిబ్బందితో సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలి గానీ దౌర్జన్యానికి దిగడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితుడు చలపతిరావుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కుటుంబ సభ్యులు చేపట్టిన నిరసనకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతుగా నిలిచింది. టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మల్లెల వీరనారాయణ, పట్టణ అధ్యక్షుడు అటికేతి శంకర్ల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రెస్టారెంట్ ఎదుట పెద్ద సంఖ్యలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కార్మికులపై దాడులకు పాల్పడిన యజమానిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన నిజానిజాలు తేలాలంటే రెస్టారెంట్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని బహిర్గతం చేయాలని, బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

