Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండ జిల్లాలో భారీ నాఖా బందీ.. 738 వాహనాలపై చర్యలు

కలం, నల్లగొండ : నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో శనివారం రాత్రి పోలీసులు భారీ నాఖా బందీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని, వివిధ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ వంటి ప్రధాన పట్టణాలతో పాటు జాతీయ రహదారులు, రద్దీ కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.

దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో యువకుల గుంపులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ తనిఖీల్లో భాగంగా బైకులు, కార్లు, ఆటోలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, నంబర్ ప్లేట్లను పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్లు మార్చిన వాహనాలు, నంబర్ ప్లేట్లు లేని మొత్తం 738 వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అలాగే రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి, నేరచరిత్ర కలిగిన వారు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. “జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. నేరాల నియంత్రణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. యువత చట్టాలను గౌరవించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. రోడ్లపై స్టంట్లు వేయడం, సైలెన్సర్లు మార్చి అధిక శబ్దాలతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తాం.” అని ఎస్పీ వివరించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపించినా వెంటనే సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ఈ భారీ తనిఖీల్లో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>