కలం, వెబ్‌డెస్క్: తన కామెడీ మాటలతో, అమాయకపు చేష్టలతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చ (Aggipette Macha) అనారోగ్యంతో నేడు మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం పలు అనారోగ్య కారణాలతో అగ్గిపెట్టె మచ్చ తిరుపతిలోని స్విమ్స్‌లో చేరారు. కొద్ది రోజుల నుంచి అతడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా లేకపోవడంతో అందరూ మచ్చ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మచ్చ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని అందరూ ప్రార్థించారు. కానీ, పరిస్థితి విషమించడంతో ఆయన బుధవారం మృతి చెందారు.
కరోనా టైంలో అగ్గిపెట్టె మచ్చ సోషల్ మీడియాలో ఎంతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన ఇంటర్వ్యూల కోసం యూట్యూబర్లు ఎగబడ్డారు. ఒకానొక సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లలో ఎక్కడ చూసినా ఆయన వీడియోలే దర్శనమిచ్చాయి. సరిగా మతిస్థిమితం లేకపోవడంతో మచ్చ అమాయకంగా ప్రవర్తించేవాడు. అలాగే ఆయనకు త్వరగా కోపం వచ్చేది. అలాంటి సమయంలో ఆయన ప్రవర్తించే తీరు కూడా విభిన్నంగా ఉండేది. ఇలా ఆయనకు ప్రత్యేకమైన హావభావాలు, అమాయకత్వంతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మచ్చ చనిపోయాడన్న వార్తతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. అయితే మచ్చ మృతికి స్పష్టమైన కారణాలు తెలియ రాలేదు.

