గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా తెలంగాణ: రాకెట్‌ను ప్రారంభించిన సీఎం

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ రాష్ట్రం అంతరిక్ష పరిశోధనలు, ఏరోస్పేస్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్మార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన దేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) శనివారం జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్‌లో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ రాకెట్ త్వరలోనే శ్రీహరికోట నుంచి రోదసిలోకి దూసుకెళ్లనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను అంతర్జాతీయ ఏరోస్పేస్ కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

రాష్ట్రం పారిశ్రామికంగా సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ గడిచిన ఏడాది కాలంలో ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2023-24, 2024-25 మధ్య కాలంలో రాష్ట్రం 117.9 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం. ముఖ్యంగా విమాన భాగాలు, రక్షణ రంగ పరికరాల ఎగుమతులు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయని ఆయన పేర్కొన్నారు. బోయింగ్, ఎయిర్‌బస్, సఫ్రాన్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇప్పటికే తెలంగాణలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCలు) పాలిటెక్నిక్ కళాశాలలను తీసుకువచ్చి పాఠ్య ప్రణాళికను పూర్తిగా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. ఈ క్రమంలోనే స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ కూడా స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చింది. మల్లెపల్లిలోని ఏటీసీలను సందర్శించాలని స్కైరూట్ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, స్కైరూట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: రీల్స్ క్రేజ్ : ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు తీస్తున్న యూత్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>