కలం, స్పోర్ట్స్: శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఇటీవలే సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నారు. అయితే, ఈ శుభసమయంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది. ధావన్ తన మాజీ భార్యను ఉద్దేశించి “నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు అని ఆమె అంది, ఇప్పుడిదే నా సమాధానం” అని అన్నట్లు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ అసత్య ప్రచారాలపై ధావన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ గతాన్ని భారంగా మోయలేదని, మైదానంలోనైనా బయటైనా పాజిటివిటీని మాత్రమే నమ్ముతానని ఆయన స్పష్టం చేశారు. తన పేరును వాడుకుంటూ క్లిక్‌బైట్ కోసం తప్పుడు ప్రకటనలు సృష్టించవద్దని ఆయన కోరారు. గతాన్ని గౌరవిస్తూనే, ప్రస్తుతం తాను చాలా కృతజ్ఞతతో ఉన్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ధావన్ (Shikhar Dhawan), సోఫీ షైన్ (Sophie Shine) ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. 2025 మే నెలలో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన వీరు, ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ మొదటిసారి దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో కలిసి కనిపించారు. అంతకుముందు 2023 అక్టోబర్‌లో ధావన్ తన మొదటి భార్య అయేషా నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. ధావన్ భార్య సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందిన వారు. ఆమె నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రొడక్ట్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. లిమరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మార్కెటింగ్ మరియు మేనేజ్‌మెంట్‌లో ఆమె పట్టా పొందారు. ప్రస్తుతం ధావన్ తన కొత్త వైవాహిక జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. అభిమానులు, మీడియా కూడా అసత్య ప్రచారాలను నమ్మకుండా ప్రేమను, సానుకూలతను పంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also: పాక్‌పై వివక్ష చూపితే మామూలుగా ఉండదు.. ఫ్రాంచైజీలకు ఈసీబీ వార్నింగ్ !!
Follow Us On: Youtube

