కలం, నల్లగొండ: ప్రతి పనికీ లంచం డిమాండ్ చేస్తూ, సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న శాలిగౌరారం (Shaligouraram) ఎంపీడీఓ జి.జ్యోతిలక్ష్మిపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. ఆమెను ఆ బాధ్యతల నుండి తొలగిస్తూ.. ఇంచార్జ్ ఎంపీడీవోగా నకిరేకల్ ఎంపీఓ రజితను నియమిస్తూ జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులు అందరూ ఏకమై ఎంపీడీవో జ్యోతిలక్ష్మి తీరుపై ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రతి చిన్న పనికీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వని పక్షంలో మెమోలు జారీ చేస్తానని, జీతాలు ఆపేస్తానని మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒత్తిడి తెచ్చి కార్యాలయానికి తన కోసం కూలర్ కొనిపించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శులకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నా, ల్యాప్‌టాప్‌లు కొనాలన్నా కమీషన్లు డిమాండ్ చేశారని సిబ్బంది పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఎంపీడీవోగా ఉన్న జ్యోతిలక్ష్మి తన బాధ్యతలను వెంటనే రజితకు అప్పగించి, రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

