కలం, నిర్మల్: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని, నిత్య జీవితంలో భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని సాయి దీక్ష సేవా సమితి (Sai Deeksha Seva Samithi) అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో జొన్నల మనోహర్ నివాసంలో శనివారం రాత్రి సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ముందు సాయి పాదుకలు, సాయి బాబా చిత్రపటాన్ని ఘనంగా ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సాయి భజనలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి శనివారం సాయి భక్తుల నివాసాల్లో సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆధ్యాత్మిక విలువలను సమాజంలో విస్తరింపజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

