ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించండి: వేణుగోపాలాచారి

కలం, నిర్మల్ : ఈ నెల 9న జరగనున్న ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సముద్రాల వేణుగోపాల చారి (Samudrala Venugopala Chary) కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ (సీఐటీయూ), ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్‌టీయూసీ) సంఘాలు మహాకూటమిగా ఏర్పడి బాణం గుర్తుపై పోటీ చేస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికులంతా ఐక్యంగా నిలిచి మహాకూటమికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర కీలకమని వేణుగోపాల చారి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆర్టీసీ కార్మికులు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలను రద్దు చేసిందని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చేపట్టిన 53 రోజుల సమ్మె సందర్భంగా 35 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించకుండా, సంస్థను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఏకమై కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేయడంతో పాటు, గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీకి పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించిందన్నారు. 3500 కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు, శ్రామిక శక్తి ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా 5000 మంది ఉద్యోగుల భర్తీకి చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, యూనియన్ ఎన్నికలు పూర్తయ్యాక నూతన యూనియన్ నాయకులతో కలిసి విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుందని వేణుగోపాల చారి వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో విలీన ప్రక్రియ పూర్తవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతే యూనియన్ ఎన్నికల అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని 60 డిపోల్లో సమావేశాలు నిర్వహించామని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంస్థ భవిష్యత్తు కోసం మహాకూటమి అభ్యర్థులను బాణం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>