బోణీ కొట్టిన కేకేఆర్.. రాజస్థాన్‌ను ఉతికేసిన రింకూ సింగ్

కలం, వెబ్ డెస్క్ : KKR vs RR | ఐపీఎల్ 2026లో ఎట్టకేలకు కోల్‌కతా నైట్ రైడర్స్ విజయ గర్జన చేసింది. వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్, ఒకానొక దశలో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, కెప్టెన్ అజింక్య రహానే ఇద్దరూ డకౌట్ కావడంతో స్టేడియం నిశ్శబ్దమైపోయింది. అయితే, ‘మిస్టర్ ఫినిషర్’ రింకూ సింగ్ (53 నాటౌట్) మరోసారి అసాధ్యమైన మ్యాచ్‌ను సుసాధ్యం చేశాడు. అనుకుల్ రాయ్ (29 నాటౌట్) తో కలిసి అజేయమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి, కేవలం 19.4 ఓవర్లలోనే జట్టును విజయతీరాలకు చేర్చాడు. రాజస్థాన్ బౌలర్లలో రవీంద్ర జడేజా తన స్పిన్‌తో కేకేఆర్ బ్యాటర్లను వణికించినప్పటికీ, రింకూ వీరోచిత పోరాటం ముందు రాజస్థాన్ తలవంచక తప్పలేదు.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (46), యశస్వి జైస్వాల్ (39) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. కెప్టెన్ రియాన్ పరాగ్ (12), షిమ్రాన్ హెట్మెయర్ (15) పరుగులకే పరిమితమయ్యారు. ధ్రువ్ జురెల్ (5), డొనోవన్ ఫెరీరా (7), రవీంద్ర జడేజా (9) చేతులెత్తేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి తలో 3 వికెట్లతో ఆర్ఆర్ వెన్నువిరవగా, సునీల్ నరైన్ 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.

లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఆరంభం భీతి గొల్పింది. టిమ్ సీఫెర్ట్, అజింక్య రహానే సున్నాకే వెనుదిరగగా, కామెరాన్ గ్రీన్ (27), రోవ్‌మన్ పావెల్ (23) కాసేపు పోరాడినా వికెట్లు కాపాడుకోలేకపోయారు. అంగ్క్రిష్ రఘువంశీ (10), రమణదీప్ సింగ్ (10) నిరాశపరిచారు. ఈ దశలో రింకూ సింగ్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాది మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతనికి జతగా అనుకుల్ రాయ్ 16 బంతుల్లో 29 పరుగులు చేసి కేకేఆర్‌కు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించారు. రాజస్థాన్ బౌలర్లలో రవీంద్ర జడేజా 3 ఓవర్లలో కేవలం 8 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టినా ఫలితం లేకపోయింది. జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, రవి బిష్ణోయ్, యష్ రాజ్ పుంజా తలో వికెట్ సాధించారు.

Read Also: తెలంగాణ‌పై తేజ‌స్వీ వ్యాఖ్య‌లు.. కేంద్ర మంత్రి క్ష‌మాప‌ణ‌లు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>