కలం, వెబ్ డెస్క్: ఒడిశాలోని (Odisha) బెర్హంపుర్లో ఉన్న ఎంకేజీసీ మెడికల్ కాలేజీలో అరుదైన శిశువు జన్మించింది. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కంధమాల్ జిల్లా తుముడిబంధ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ 32 వారాల గర్భధారణకే డెలివరీ అయ్యింది. శిశువుకు ఒకే శరీరంపై రెండు తలలు, రెండు మెడలు ఉన్నాయి. అయితే, ఒక జత చేతులు, కాళ్లతోపాటు ఒకే మూత్ర, జననేంద్రియ వ్యవస్థ ఉండటం ఈ కేసులో ప్రత్యేకత. వైద్య పరిభాషలో ఈ అరుదైన పరిస్థితిని ‘డైసెఫాలస్ పారాపాగస్’ అంటారు. ఇలాంటి కేసులు సుమారు మూడు లక్షల జననాల్లో ఒకటి మాత్రమే సంభవిస్తాయని అంచనా. ఈ అరుదైన ఘటన వైద్య వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

