యాదగిరిగుట్టలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కలం, యాదగిరిగుట్ట : వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Anuraag Jayanti) అధికారులను ఆదేశించారు. శిక్షణ పొందిన యువతకు కేవలం సర్టిఫికెట్లు అందించడమే కాకుండా, వారి నైపుణ్యాలకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

బుధవారం యాదగిరిగుట్టలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ (Anuraag Jayanti) సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థుల హాజరు, బోధనా విధానం, ప్రాక్టికల్ శిక్షణ, పరీక్షల నిర్వహణ, శిక్షణ అనంతరం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కేంద్రంలో అందిస్తున్న వివిధ కోర్సులు, వాటి ద్వారా శిక్షణ పొందుతున్న అభ్యర్థుల సంఖ్య, వారికి అందిస్తున్న శిక్షణ నాణ్యత తదితర అంశాలను సమీక్షించారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు నిర్వహిస్తున్న పరీక్షల ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందించడంతో పాటు, ఉద్యోగాలు పొందేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.

యువతకు ఉపాధి కల్పనలో వృత్తి నైపుణ్య శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పరిశ్రమలు, వివిధ సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించాలని, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనంజనేయులు, తహసీల్దార్ గణేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>