రామగుండం యూరియాపై ఇరాన్ ఎఫెక్ట్..

కలం, కరీంనగర్ బ్యూరో: ఇరాన్‌లో యుద్ధం తెలంగాణలో అనేక రంగాలపై ఎఫెక్ట్ చూపుతున్నది. వంట గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోయింది. కమర్షియల్ ఎల్‌పీజీ సరఫరాకు కోత పడింది. హోటళ్ల బిజినెస్ పడిపోయింది. ఆన్‌లైన్ ఆర్డర్లు తగ్గిపోవడంతో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌లకు ఉపాధికి చిక్కులొచ్చాయి. రోడ్‌సైడ్ ఫుడ్ స్టాల్స్ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. గాంధీభవన్, హైకోర్టు.. ఇలా అనేక చోట్ల క్యాంటీన్లు బంద్ అయ్యాయి. కొన్ని ఆఫీసుల్లోని క్యాంటీన్లలో మెనూ ఐటెమ్స్ లిమిట్ అయ్యాయి. ఇంకొన్ని చోట్ల పార్శిల్స్ సిస్టమ్ స్టాప్ అయింది. ఇదంతా ఒక ఎత్తయితే రామగుండంలోని యూరియా ఫ్యాక్టరీమీద కూడా గణనీమైన ప్రభావం పడింది. ఉత్పత్తి సగానికి తగ్గిపోయింది. అసలే యూరియాకు రైతాంగం తిప్పలు పడుతున్న టైమ్‌లో రామగుండం ఫ్యాక్టరీలో (Ramagundam Urea) ప్రొడక్షన్ సగానిక తగ్గడంతో సరికొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటాయన్నది కీలకంగా మారింది.

సగానికి పడిపోయిన యూరియా ఉత్పత్తి :

యాసంగి సీజన్ మొదలవుతున్న పరిస్థితుల్లో యూరియా ప్రొడక్షన్ తగ్గిపోవడంతో రైతాంగానికి ఆందోళన మొదలైంది. సహజ వాయువు ఆధారంగా పనిచేసే యూరియా ఫ్యాక్టరీ కావడంతో ఆంక్షలు తప్పలేదు. ఐదారు రోజులుగా పరిమితంగానే యూరియా ఉత్పత్తి అవుతున్నది. రాష్ట్ర వ్యవసాయ రంగానికి కల్పతరువు అనుకునే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకే కష్టం రావడంతో యూరియాకు ప్రత్యామ్నాయ సర్దుబాటు ఎలా అన్నది టెన్షన్‌గా మారింది. ఈ ఫ్యాక్టరీలో వాడే ఎల్ఎన్‌జీ ఖతార్ నుంచి సరఫరా అవుతుంది. ఇరాన్ యుద్ద ప్రభావంతో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) సరఫరాను తగ్గించింది. దీంతో ప్లాంట్ 50% సామర్ద్యంతోనే నడుస్తున్నది. రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి జరగాల్సి ఉంటే ఇప్పుడు 1,900 టన్నులు కూడా దాటడంలేదు. యూరియా సరఫరా నిలిచిపోయింది.

ఎల్ఎన్‌జీ సప్లై చెయిన్ బ్రేక్ :

రామగుండం ఎరువుల (Ramagundam Urea) ఫ్యాక్టరీ రన్ కావాలంటే రోజుకు 2 మిలియన్‌ స్టాండర్డ్స్‌ క్యూబిక్‌ మీటర్ల రీగ్యాసీఫైడ్‌ లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ (RLNG) అవసరం. ఖతార్‌ నుంచి గుజరాత్‌లోని దహేజ టర్మినల్‌కు నౌకల ద్వారా వస్తుంది. అక్కడి నుంచి పెట్రోనెట్‌, ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్‌ ద్వారా గెయిల్‌ పైప్‌లైన్‌ ద్వారా కాకినాడకు చేరుతుంది. అక్కడి నుంచి మల్లవరం గ్యాస్‌ పైప్‌లైన్‌ ద్వారా ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు సప్లై అవుతుంది. ఖతార్‌లో ఉత్పత్తి ఆగిపోవడం, నౌకల ద్వారా సరఫరా నిలిచిపోవడం.. దేశంలో తగినంత స్టాక్ లేకపోవడం.. వీటిన్నింటి కారణంగా ఎల్ఎన్‌జీ కొరత ఏర్పడింది. రామగుండం ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తికి రోజుకు 2 మెట్రిక్ మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం. కానీ ఐదారు రోజులుగా అది 1.4 మిలియన్ క్యూబిక్ మీటర్లు కూడా అందడంలేదని ఆ ఫ్యాక్టరీ వర్గాల సమాచారం. కేవలం రామగుండం ఫ్యాక్టరీకి మాత్రమే కాక దేశంలోన ఇతర యూరియా ఫ్యాక్టరీలకు కూడా ఎల్ఎన్‌జీ సరఫరా దాదాపు 40% మేర తగ్గిందని ఆ వర్గాలు తెలిపాయి.

ఎల్ఎన్‌జీ కోసం ఖతార్‌పైనే ఆశలన్నీ :

దేశం మొత్తానికి అవసరమైన ఎల్ఎన్‌జీ దిగుమతిలో దాదాపు 60% ఒక్క ఖతార్ నుంచే వస్తున్నది. యాభై శాతం కంటే సరఫరా తగ్గిపోతే ఫ్యాక్టరీ మెషీన్లకు కూడా టెక్నికల్ సమస్యలు వస్తాయని ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ప్రస్తుతం 50% సామర్ద్యంతో నడుస్తున్నట్లు తెలిపాయి. ఇప్పటికే హెచ్‌టీఆర్ వైఫల్యంతో 110 రోజులకు పైగా ప్లాంట్ షట్ డౌన్ అయ్యింది. ప్రస్తుతం సామర్ద్యాన్ని 50 శాతానికి తగ్గించడంతో టెక్నికల్ సమస్యలు ఎదురవుతాయన్న ఆందోళనను ఆ వర్గాలు వ్యక్తం చేశాయి. గెయిల్ నుంచి ఎల్ఎన్‌జీ సరఫరా మరింత తగ్గితే ప్లాంట్ పూర్తిగా షట్ డౌన్ అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్లాంట్ కు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశాయి. ప్రతీ రెండు కిలోల యూరియా ఉత్పత్తికి 1 క్యూబిక్ మీటర్ ఎల్ఎన్‌జీ అవసరమన్నాయి. యూరియా మాత్రమే కాక అమ్మోనియా, ఇతర ఎరువులకు కూడా ఎల్ఎన్‌జీ అవసరమన్నాయి.

ఖరీఫ్ సీజన్‌కు పొంచి ఉన్న కష్టాలు :

ఇప్పటికే విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే యూరియా రవాణాకు విఘాతం ఏర్పడింది. దీనికి తోడు రామగుండం యూనిట్‌లో ఉత్పత్తి కూడా సగం తగ్గింది. ఇక్కడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా గ్యాస్‌ ఆధారంగానే నడుస్తున్నది. ఎల్ఎన్‌జీ సరఫరాలో కోత విద్యుత్ ఉత్పత్తిపైనా పడుతున్నది. ప్రత్యామ్నాయాలపై డిస్కం అధికారులు ఆలోచిస్తున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా వార్షిక ఉత్పత్తి టార్గెట్ 12.7 లక్షల టన్నులు. ఈ ఏడాది ప్రారంభంలో అత్యధిక కాలం షట్‌డౌన్‌లోనే ఉండిపోయింది. దీంతో ఫిబ్రవరి నెలాఖరుకు 8.5 లక్షల టన్నుల యూరియానే ఉత్పత్తయింది. యూరియా ఉత్పత్తి తగ్గితే ఆ ప్రభావం రైతులపై ప్రత్యక్షంగా పడనున్నది. ఏటా ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో దాదాపు 45% రాష్ట్రానికే సప్లై అవుతున్నది. రైతులు ఖరీఫ్ సీజన్ సాగు కోసం సిద్ధమవుతున్న టైమ్‌లో యూరియా కోత ఆందోళనకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.

Read Also: ఆ ఒక్కడు ఎక్కడ? గణపతి పై వీడని సస్పెన్స్!

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>