కలం, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా నేడు విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ఆమె దర్శించుకోనున్నారు. రాత్రి 7:10 గంటల సమయంలో దుర్గగుడికి చేరుకోనున్న రాష్ట్రపతి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్, భద్రతా కారణాల దృష్ట్యా ఆలయంలో సాధారణ క్యూలైన్లను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
పర్యటనలో రెండవ రోజైన రేపు, విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ‘సరస్ మేళా’ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలతో ప్రత్యేకంగా నిర్వహించే విందు కార్యక్రమంలో పాల్గొని వారితో ముచ్చటిస్తారు. పర్యటన ముగించుకుని రేపు మధ్యాహ్నం 2:45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

