రియ‌ల్ ఎస్టేట్‌, పేద‌ల ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత‌: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: రియ‌ల్ ఎస్టేట్ రంగంపై ఉద్దేశ‌పూర్వ‌కంగానే గోబెల్స్ ప్ర‌చారం చేస్తున్నారని.. వారి మాటలు న‌మ్మొద్దని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్ప‌ష్టం చేశారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేద‌ని.. ఈ విష‌యంలో స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ మంత్రిగా స్ప‌ష్ట‌మైన ఆధారాలు, వివ‌రాలు ఉన్నాయ‌ని చెప్పారు. హైదరాబాద్ లో శనివారం జ‌రిగిన ఒక‌ కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడుతూ.. గ‌త రెండున్నరేళ్ల ప్రజాపాలనలో సుమారు 15 నుంచి 20 శాతం రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ధి జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు. 40 శాతం వ‌ర‌కు ఫ్లాట్ల విక్ర‌యాలు వృద్ది చెందాయ‌ని వివరించారు.

గ‌డ‌చిన ప‌దేళ్ల‌తో పోలిస్తే ఈ రెండున్న‌ర ఏళ్ల‌లో రెసిడెన్షియ‌ల్ మార్కెట్ విశేషంగా పెరిగింద‌ని అన్నారు. ఇందుకు సంబంధించి తమ స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో పెరిగిన రిజిస్ట్రేష‌న్ డాక్యుమెంట్ల సంఖ్య‌నే నిద‌ర్శ‌న‌మని తెలిపారు. 2004 నుంచి 2014 వ‌ర‌కు ఉమ్మ‌డి ఏపీలోని కాంగ్రెస్ ముఖ్య‌మంత్రుల కార‌ణంగానే హైద‌రాబాద్ ఒక రోల్ మోడ‌ల్‌గా రూపొందింద‌ని అన్నారు, వారి దూర‌దృష్టి వ‌ల్లే ఓఆర్ఆర్‌, అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, ఐటి సెక్టార్ వంటివి వచ్చాయన్నారు. అందువ‌ల్లే హైద‌రాబాద్ ఇప్పుడు దేశంలోనే గాక ప్ర‌పంచంలోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌ని చెప్పుకొచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యూహాత్మక నిర్ణయంతో హైద‌రాబాద్ న‌గ‌రాభివృద్దికి చ‌ర్య‌లు చేప‌ట్టారని పొంగులేటి (Ponguleti) అన్నారు. రూ.7వేల కోట్ల‌తో చేప‌డుతున్న మూసీ ప్రాజెక్ట్ సుంద‌రీక‌ర‌ణ ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలిపారు. తొలి విడ‌త 28 కిలోమీట‌ర్ల అభివృద్దికి వారం ప‌ది రోజుల్లో టెండ‌ర్లు పిలవ‌బోతున్నామ‌ని అన్నారు. పాత బ‌స్తీ త‌దిత‌రాల‌ను క‌లుపుతూ రెండ‌వ విడ‌తగా 76 కిలోమీట‌ర్ల మేర రూ.24 వేల కోట్ల‌తో మెట్రో విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంద‌ని ప్రకటించారు. ఇవేగాక త్రిబుల్ ఆర్ నుంచి ఓఆర్ఆర్ క‌లుపుతూ రేడియ‌ల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాద‌న‌లు సిద్ద‌మ‌వుతున్నాయ‌ని అన్నారు.

రాష్ట్రంలో భూముల భ‌ద్ర‌త క‌ల్పించేందుకు భూభార‌తి చట్టాన్ని తీసుకువ‌చ్చామ‌ని మంత్రి పొంగులేటి వివరించారు. వీటిలో కొన్ని చిన్న చిన్న‌స‌మ‌స్య‌ల‌ను సాఫ్ట్ వేర్ ప‌రంగా 15-20 రోజుల్లో స‌రిచేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్నారు. హైదరాబాద్ లోని పేద‌లకు ఇందిర‌మ్మ ఇళ్లు అందించేందుకు క్యూర్ ప‌రిధిలో తొలివిడ‌త‌గా ల‌క్ష ఇందిర‌మ్మ ఇళ్లు అందించేందుకు నిర్ణ‌యించామ‌ని చెప్పారు. దీని త‌ర్వాత పలు దశలుగా ఇళ్ల మంజూరు ఉంటుంద‌ని చెప్పారు.

Read Also: ఆందోళనలు విరమించి ఇంటికి వెళ్తున్నాం : సీజేపీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>