సమగ్ర భూసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తాం: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సమగ్ర భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని.. ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామని వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ సచివాలయంలో రెవెన్యూ అధికారులతో భూ సర్వే పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. సర్వేను స్పీడప్ చేసేందుకు ఇప్ప‌టికే ఉన్న 411 రోవ‌ర్ల‌కు అద‌నంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని అన్నారు. భూ సర్వేలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి సంతృప్తే ప్రాధాన్యంగా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాల‌కు గానూ తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలలో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసినట్లు తెలిపారు. నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎంపిక చేసిన ఈ గ్రామాల్లో ఇప్పటివరకు 285 గ్రామాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు. వ‌చ్చేనెల చివ‌రినాటికి మొద‌టి ద‌శ భూ సర్వే పూర్తి చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నామని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే పనులను ముమ్మరం చేసేందుకు సాంకేతిక పరికరాలను ప్రభుత్వం సమకూరుస్తోందని మంత్రి (Ponguleti) తెలిపారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశామని.. అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. రీసర్వేతో  భూ యాజమాన్య హక్కులపై స్పష్టత పెరగడంతో పాటు భవిష్యత్తులో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల  సమస్యలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరులోని నేల‌కొండ‌ప‌ల్లి మండ‌లం కొంగ‌ర గ్రామ ప‌రిధిలో ఉన్న మొత్తం 665 ఎక‌రాల‌లో వంద‌శాతం రీస‌ర్వేను విజ‌య‌వంతంగా పూర్తిచేశామ‌ని తెలిపారు. ఈ గ్రామంలో త్వరలోనే భూదార్ పట్టాల (Bhudhar Pattas) పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.

Also Read : కొంగరలో భూ సర్వే పూర్తి.. పొంగులేటి కీలక ప్రకటన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>